పసిపిల్లలకి బువ్వ పెట్టడం ఒక పెద్ద పని.ఊసులాడాలి, బుజ్జగించాలి, కథలు చెప్పాలి, కబుర్లు చెప్పాలి అప్పటికి కాని బువ్వ తినరు.ప్రతి ఇంటిలోనూ జరిగే తంతే ఇది.
అలనాటి రామచంద్రుడు కూడా అద్దంలో చందమామని చూపిస్తే కాని పాలు తాగాలేదంట! కన్నయ్యకి పాలు పట్టడానికి, బువ్వపెట్టడానికి ఎన్ని కష్టాలు పడిందో మన యశోదమ్మ ఇల్లంతా పరుగులెత్తించేసే
వాడంట.అట్లాంటి కృష్ణయ్యకి రామకథ చెప్పి బువ్వ పెట్టిందని మనకి తెలుసు.
అలాగే నా చిన్నప్పుడు నాకు బువ్వ పెట్టడానికి మా నానమ్మ చెప్పిన కథ ఇదిగో...
అనగనగా ఒక రాజు.. రాజుగారికి ఏడుగురు కొడుకులు.. ఏడుగురు కొడుకులు వేటకెళ్ళారు.. వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు. ఒక చేప ఎండలేదు... చేప చేప ఎందుకెండలేదు? గడ్డివాము అడ్డొచ్చింది.... గడ్డివాము గడ్డివాము ఎందుకు అడ్డోచ్చావ్...? ఆవు నన్ను మేయలేదు... ఆవూ ఆవూ ఎందుకు మేయలేదు?? గొల్లవాడు నన్ను వదలలేదు... గొల్లవడా గొల్లవడా ఆవుని ఎందుకు వదలలేదు?? అవ్వ నాకు బువ్వ పెట్టలేదు అవ్వా అవ్వా బువ్వ ఎందుకు పెట్టలేదు? పిల్లవాడు ఏడుస్తున్నాడు... పిల్లాడా పిల్లాడా ఎందుకేడుస్తున్నావు? చీమ నన్ను కుట్టింది... చీమా చీమా ఎందుకు కుట్టావు? చీమ అంది... నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అని...
ఇంకేంటి? కథ కంచికి మనం ఇంటికి...
కథ అయిపొయింది... అంతే అని అందరం అనుకుంటాం...
కానీ చాల ఉందండీ!
నాకు ఏం తోచకపోతే మా చిన్నాన్నకి ఫోన్ చేశా...
చిన్నాన్నా ఏం తోచట్లే నాకు ఏదైనా చెప్పు అన్నాను.
ఏం చెప్పను? అన్నాడు...
నాకు కొంచం కథల పిచ్చి ఎక్కువ... అందుకని ఒక కథ చెప్పు అన్నా...
అరె! చిన్నాన్నా నాకు ఈ కథ చిన్నప్పుడే తెలుసు... అన్నాను.
సరే! ఐతే నీకు ఈ కథలో ఏమర్థమయ్యింది అన్నాడు.
ఇందులో అర్థమవకపోవడానికి ఏముంది? చీమ పుట్టలో వేలు పెడితే కుడుతుంది అన్నాను..
ఫక్కున నవ్వాడు చిన్నాన్న...
ఎందుకు చిన్నాన్నా నవ్వుతున్నావు అన్నాను.
అరేయ్! చిన్నవాడా... ఈ కథ చాల చమత్కరమైందిరా... అని మొదలుపెట్టాడు.
నేనూ ఉ.. కొట్టడం మొదలు పెట్టాను...
అనగనగా ఓ రాజు... రాజుగారి ఏడుగురు కొడుకులు వేటకెళ్ళి చేపలు తేవడం,అందులో ఒక చేప ఎండకపోవడం
వరకు సరే... అంతా బానే ఉంది. చేప ఎండలేదంట రాజుగారి కొడుకు చేపని అడిగాడంట చేపా చేపా ఎందుకు ఎండలేదు? అని...
చేప ఎక్కడైనా మాట్లాడుతుందా?? అని ప్రశ్న వేసాడు.
నేను లేదు అన్నాను...
మనం కథల్లోనే ఇలా జంతువులూ పక్షులు చెట్లు మాట్లాడటం చూస్తుంటాం...
ఇది కథ కనుక సరే మాట్లాడింది అనుకుందాం...
చేప జవాబిచ్చిందట... గడ్డివాము అడ్డువచ్చిందని... సరే ఏదైనా అడ్డు పడితే ఎండదు అది నిజమే!
ఇలా చెప్పి ఎండని చేప తప్పించుకుంది...
కానీ ఇక్కడ రాజుగారి కొడుకు అక్కడితో ఆగలేదు... గడ్డివాముని కూడా అడిగాడు గడ్డివాము గడ్డివాము
ఎందుకు అడ్డోచ్చావ్ అని...
గడ్డివాము ఒక సాకు చెప్పింది ఆవు నన్ను మేయలేదు అని...
గడ్డివాము కూడా తప్పించుకుంది... నాది కాదు తప్పు ఆవు నన్ను మేయలేదు కనుక నేను అడ్డోచాను అంది...
సరే అని ఆవు ఆవునుండి గొల్లవాడు గొల్లవాడినుంచి అవ్వ అవ్వ నుంచి పిల్లవాడు పిల్లవాడినుంచి చీమ. అక్కడితో
కథ అయిపోతుంది...
ఇక్కడ ఏం జరుగుతోందంటే!
ఏదైనా ఒక పని సరిగా జరగకపోతే తన తప్పు ఉన్నా తప్పు నాది అని ఒప్పుకోడు...
పక్కవాడి మీదకి నేట్టేస్తున్నాడు... వాడు ఇంకొకడి మీదికి వాడు మరొకడి మీదికి...
నేరం నాది కాదు వాడిది ఆ పక్కవాడిది అని అలా అలా ఎక్కడికో పోతోంది.
సరైన కారణం లేకుండా సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు.
ఇలా ఉంటుందిరా లోకంలో అని ఎంతో అందంగా ఈ కథ చెప్పాడు మనకి.
అందుకే ఓ సినిమా కవి రాసాడు "ఇంతేనయా! తెలుసుకోవయా !! ఈ లోకం ఇంతేనయా..." అన్నాడు చిన్నాన్న.
ఈ లాజిక్ చిన్నప్పుడే చెప్తే నీకు అర్థం కాదు కదా? అందుకే ఇది కేవలం కథగానే చెప్తారు అప్పుడు.
ఈ కథ ద్వారా లోకం పోకడ ఏమిటో కథకుడు మనకి ఇలా చెప్పాడు.అన్నాడు.
నేను ఆశ్చర్యపోయా!! అవును చిన్నన్నోయ్ నేనెప్పుడు ఇలా ఆలోచించలేదు సుమీ!
బావుంది చిన్నాన్నా చాల బావుంది!
జోహార్లు చిన్నాన్నా నీకు..!
చాలా కొత్తగా ఉంది... ఎప్పుడూ కథని అలా కథగానే చూసేవాణ్ణి. ఇప్పుడు ఈ కథలో ఇంత అంతరార్థం ఉందంటే
అమ్మో! కథలు కూడా కొత్త కోణాల్లో చూడలన్నమాట...
పెద్దలు మనకి ఏది చెప్పినా దానికి ఓ అర్థం పరమార్థం ఉంటుంది...
అందుకే కదా! మనమంటాం.. "పెద్దల మాట... చద్దన్నం మూట".