Tuesday, September 23, 2014

వింత ప్రయాణం

                   ఎప్పుడూ ప్లానింగ్ మిద నాకు సదభిప్రాయం లేదు. Management  Science లో "POSDCORB" అని చదివినా... ప్లానింగ్ ఫస్ట్ లెటర్ అయినా సరే... అన్నీమనం అనుకున్న ప్రకారంగా జరగవు కదా! అని నాకో నమ్మకం ...

                 "తానోటి తలచిందంటే దైవం ఇంకోటి తలుస్తుంది అన్నట్టు"  మనకి ఎలాగు ఉండనే ఉంది కదా... అందుకే ఎప్పుడు ప్రయాణం చేసిన అప్పటికప్పుడో కొంచెం ముందో బయల్దేరడం అలవాటు. ముందురోజు ప్రయాణానికి కావలసినవి సర్దుకోవడం... బాగ్ లకి తాళాలు... బస్సు లోనో ట్రైన్ లోనో తినడానికి ఏదో ఒకటి పట్టుకెళ్ళటం... (బయట తినే అలవాటు లేదు నాకు).  బస్సు బయల్దేరే సమయానికన్నా ఒక అరగంట ముందే ఉండటం... పడిగాపులు పడి బస్సోచ్చేక హడావిడిగా ఎక్కి... ఇలాంటి ప్రయాణాలు నాకు కష్టం... ట్రైన్ ఐతే ఎలాగు కరెక్ట్ టైం కి తీస్తాడు లేట్ అయినా తెలుస్తుంది. కానీ ఈ ప్రైవేటు బస్సులు అలా కాదు... వాడిష్టం... కొన్నిసార్లు మన అదృష్టం బావుండి టైం కి వచ్చేస్తాడు... మనకి అసలే అదృష్టం షర్టు పై పాకెట్ లో పెట్టుకు తిరుగుతాం కదా! మన అదృష్టం కొద్దీబండి అరగంటో...  గంటో... లేట్... ఎప్పుడూ ఇదే తంతు... కొన్ని ప్లాన్ ప్రకారం జరగకపోయినా ప్లానింగ్ ఎంత important అన్నది ఈ incident  నుంచి తెల్సుకున్నా... ఎప్పుడూ Main plan  తో పాటు ఓ సెకండరీ plan కూడా ఉండాలి. ఒకవేళ ముందుది ఫెయిల్ అయినా రెండవది workout  అవుతుంది. అదికూడా అవలేదంటే ఆ బ్రహ్మ కూడా కాపాడలేడు.

అసలేం జరిగిందంటే...!

                   హైదరాబాద్ నుంచి వైజాగ్ తిరుగు ప్రయాణం. మీటింగ్ అంతా అయిపోయి రూం చేరుకునేప్పటికి 4:00PM  అయింది. సరే ఇంకా రెండు గంటలు ఉంది కదా ప్రయాణానికి. ఎలాగు బస్సు 6:15PM కి కదా ఇక్కడ గం.6 లకి బయల్దేరినా చాలుకదా... మాదాపూర్ నుంచి కొండాపూర్ ఎంతసేపు కళ్ళు మూసుకుంటే ఆటోలో 5 నిముషాల్లో చేరుకోవచ్చు అని చిన్న కునుకు తీద్దాం అనుకుని మంచం ఎక్కా... కళ్ళు తెరిచేటప్పటికి 6:00 అయింది. ఎలాగు బండి ఉంది... ముగ్గురం కష్టం కదా! నీకు luggage  ఉంది కనుక నువ్వు బండి మిద వెళ్ళిపో నేను ఆటోలో వచ్చేస్తాలే అని బండి మీద వాళ్ళని వెళ్ళమని నేను ఆటో ఎక్కుదామని మెయిన్ రోడ్ దాకా నడిచా!
ఆటోలు వస్తూ పోతున్నాయి... ఒక ఆటో వచ్చి ఆగింది...

భయ్యా! కొండాపూర్ సిగ్నల్ దగ్గరకి అనగానే ఎక్కు అన్నాడు... ఓ పావు కిలోమీటర్ వెళ్ళాక ఎక్కడికెళ్ళాలి అన్నాడు. అదేంటి భయ్యా  కొండాపూర్ సిగ్నల్ అని చెప్పా కదా! అన్నాను....
నేను అటు వెళ్ళట్లేదు దిగి అటు వెళ్తే ఆటోలు దొరుకుతాయి అన్నాడు... ముందే చెప్పచు కదా అని ఇప్పుడు గొడవపడటం సరి కాదని పది రూపాయలు ఇచ్చేసి రోడ్ క్రాస్ చేసి ఇంకో ఆటో డైరెక్ట్ గా కొండాపూర్ సిగ్నల్స్ దగ్గరికి మాట్లాడదామని అనుకున్నా... ఒక్క ఆటో కుడా రాదేం! అప్పటికే 6:10 ఎలాగు బస్సు లేట్ ఉంటుంది కదా మనం టైం కి చేరిపోతాం అనే నమ్మకం.

ఒక ఆటో వాడు వచ్చాడు... కొండాపూర్ సిగ్నల్స్ దగ్గరికి 30 ఇస్తా వస్తావా?? 120 ఇవ్వండి అన్నాడు... నేనింకా  అర్జెంటు కాబట్టి 30 చెప్పా... టికెట్ సర్వీస్ ఐతే 10/-
అసలే మన అదృష్టం ఎక్కువ కదా! బస్సు టైం కి వచ్చేస్తుందేమో అని సర్లే 50 ఇస్తా అన్నా... లేదు 90 ఇవ్వండి అన్నాడు... అలా కాదు 70 చేస్కో అని ఆటో ఎక్కెసా...

                ఈలోపు "సర్ మేం ట్రావెల్స్ నుంచి  కాల్ చేస్తున్నాం.... ఎక్కడున్నారు? బస్సు ఇంకో 5 నిమిషాలలో.. " అని పూర్తి చేసే లోపే నేను ఒక 10 నిముషాల్లో ఉంటా అక్కడ అని చెప్పా..

Hitech సిటీ... రెడ్ సిగ్నల్ పడింది... సిగ్నల్ క్రాస్ చేసేప్పటికి  టైం చూస్తే 6:20... బస్సు బయల్దేరిందని ఫోన్... సరే నెక్స్ట్ స్టాప్ ఎక్కడ?? అక్కడ క్యాచ్ చేస్తా అని చెప్పా... luggage  పట్టుకుని ఉన్న అబ్బాయి బస్సు ఎక్కేసాడు ఫోన్ ల మీద ఫోన్లు అన్నయ్యా ఎక్కడున్నావ్ బస్సు తీసేస్తున్నాడు... వచ్చేసావా అని... లేదింకా ఒక 5 నిముషాల్లో అక్కడుంటా... బస్సు కొండాపూర్ నుంచి గచ్చి బౌలి చేరింది...

               పాపం ఇంకో ఫ్రెండ్ నాకోసం... బస్సు ఎలాగు మిస్ అయ్యాడు కదా బండి ఉంది కనుక... నేను కొండాపూర్ సిగ్నల్స్ దగ్గరకి వచ్చేస్తే... బస్సుని అందుకోడానికి ట్రై చేద్దాం అని వెయిట్ చేస్తున్నాడు... ఈ లోపు ఫోన్ "అన్నా ఎక్కడున్నావ్?? నేను కొండాపూర్ సిగ్నల్ కి లెఫ్ట్ లో ఉంటా.. నువ్వోచ్చేస్తే బస్సు క్యాచ్ చేద్దాం... " సరే అని ఫోన్ పెట్టేసా... కొండాపూర్ సిగ్నల్ వచ్చేసాం అని అన్నాడు... ఇదిగో అని డబ్బులిచేసి దిగి చుస్తే ఎక్కడా కనిపించలేదు ఫ్రెండ్..

ఫోన్ తీసి కాల్ చేశా... ఎక్కడున్నావ్??
"కొండాపూర్ సిగ్నల్స్ కి లెఫ్ట్ లో అన్నా... బస్సు గచ్చిబౌలి దాటిందట... "
అవును కాల్ వచ్చింది.. నువ్వు నాకు కనిపించట్లేదు... ఇదిగో ఇక్కడ పోలీస్ బీట్ ఉంది ఆయన పక్కన ఉన్నా.. కనిపించేనా??
లేదన్నా...
ఏదైనా landmark  చెప్పు... ఎదురుగా పెద్ద హోర్డింగ్ ఉంది... చూసావా??
నాకేం కనిపించట్లేదు అలాంటిది... అన్నాడు...
ఈలోపు బీట్ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లి అడిగా కొండాపూర్ సిగ్నల్స్ అంటే ఇదేనా అని...
ఆ ఇదేనండి అన్నాడు... కాల్ చేసి నేనిక్కడే ఉన్నా... పోలీస్ కూడా ఉన్నాడు అని చెప్పా.. ఈ లోపు పోలీస్ ఫోన్ తీస్కుని అడ్రస్ అడిగాడు... నేను దిగిన సిగ్నల్ కన్నా ముందు సిగ్నల్ దగ్గర ఉన్నాడు.. ఇక్కడినుంచి అక్కడికి 5నిముషాలు నడక...
పరిగేట్టుకెళ్ళినా అదే టైం ఎందుకంటే అది "హైదరాబాద్" కనుక...
తనని కలిసి బండి ఎక్కి ఇద్దరం బయల్దేరాం...

ఫోన్ చేద్దాం ట్రావెల్స్ వాడికి అంటే network not registered  అని వచ్చేసింది... ఇద్దరం బండి మిద గచ్చిబౌలి బయల్దేరాం.... బస్సు అక్కడ లేదు... తన ఫోన్ తీసి కాల్ చేశా.. బస్సు ఎక్కడ ఉంది అని... గచ్చిబౌలి నుంచి నానక్ రామ్ గూడా వెళ్లిపోయింది...

నానక్ రామ్ గూడా ఎలాగు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఆపుతాడు కదా అని అక్కడికి బండి కట్టేం...
బండి పరిస్థితి బాలేదు... వేడి సెగలు.. పెట్రోల్ ఎంతుందో తెలీదు... ఔటర్ లో పెట్రోల్ బంక్లు కూడా ఉండవు...
ఎలాగబ్బా అని ఆలోచిస్తూ సరే బస్సు దొరికితే దొరికింది... లేకపోతే ఇంకో బస్సు చూసుకుందాం అని డిసైడ్ అయ్యా... ట్రావెల్స్ వాడికి ఫోన్ చేస్తే 8:00 కి ఎల్ బి నగర్ లో బయల్దేరుతుంది అక్కడికి వచ్చేయండి అన్నాడు...
నేనింకా నానక్ రామ్ గుడా... చలో ఎల్ బి నగర్ అనడానికి లేదు...
నానక్ రామ్ గుడా... అస్సలు ఆటోల్లేవ్... వచ్చే ఒకటో రెండో బస్సులు కుడా ఆపట్లేదు..
ఎల్ బి నగర్ అంటే ఎవరు డైరెక్ట్ గా రారాయే... ఆఖరికి ఒక ఆటో వాడు వచ్చాడు...

భయ్యా! ఎల్ బి నగర్... ఎంత??
మీటర్ అన్నా అన్నాడు... సరే మీటర్ కదా అని ఎక్కేసా...
మీటర్ 20 నుంచి మొదలు... కను రెప్ప వేసి తీసే లోపు ఇంకా 10 మీటర్లు కూడా వెళ్ళలేదు 40 దాటింది...
భయ్యా మీటర్ కరాబ్ ఉంది... సరిగ్గా లేదు పక్కకి ఆపేయ్ నేను దిగిపోతా... అన్నా
మీటర్ తిప్పి మళ్ళీ వేసాడు..  20 చూపించింది...
ఆటో అబ్బాయికి ఎల్ బి నగర్ కి రూట్ తెలీదు... నాకు తెల్సినంత వరకు నేను చెప్పుకొచ్చా... అదంతా ఓ కొత్త ప్రపంచం లా అనిపించింది... ఎప్పుడు అటుపక్క ప్రయాణం చెయ్యలేదు.

ఎక్కడ ఎవరు కనిపిస్తే వాళ్ళని భయ్యా! ఎల్ బి నగర్... "సీదా జా... ఏకీ రోడ్..." ఇదే జవాబు... వాళ్ళందరూ సీదా జా సీదా జా అంటే ఆటో అబ్బి ఫ్లై ఓవర్ ఎక్కించేసాడు... ఆటోలు ఫ్లై ఓవర్ లు ఎక్కకూడదు...
కొంత దూరం వెళ్ళాక పోలీస్ ఆపేసాడు...

బండి ఆపించి..
వీడి ఆటో ఎందుకెక్కారు మీరు ? వీడు చోర్.. దోచేస్తాడు కొంత దూరం వెళ్ళేక...
నా అదృష్టం కొద్ది నాదగ్గర విలువైన వస్తువులేం లేవు... సర్ సర్ అంటున్నాడు ఆటో అతను...
నా టికెట్ చూపించి... నేను బస్సు మిస్ అయ్యానని... క్యాచ్ చెయ్యడానికి ఆటో ఎక్కా అని చెప్పా..
పోలీసులకి చెల్లించాల్సింది చెల్లించేసాకా వదిలేసాడు... మళ్ళీ ఫ్లై ఓవర్ దిగి ఎల్ బి నగర్ ఎటు అని దారిని పోయే వాళ్ళని అడుగుతూ వెళ్లాం...

ఈలోపు బస్సు లోంచి ఫ్రెండ్ కాల్ చేసాడు... అన్నయ్యా బస్సు ఎల్ బి నగర్ నుంచి బయల్దేరింది అని...
నేను ఎల్ బి నగర్ వెళ్ళేటప్పటికి 8:30... మీటర్ 415/- ఐంది సర్లే పాపం ఫైన్ కట్టేడు కదా అని ఒక పచ్చనోటు చదివించా...

ఇంతలో ఇంకో ఫ్రెండ్ కి కాల్ చేసి 9:30 బస్సుకి టికెట్ బుక్ చేయించుకున్నా... ఎలాగు బస్సు 9:30 కి మనం ఓ గంట ముందే ఉన్నాం... ఇప్పుడు మిస్ అవదు అనుకున్నా... ఇంకా టైం ఉంది కదా అని చిన్నాన్నా వాళ్ళ ఇంటికెళ్ళి భోంచేసి... 9:15 కే బయల్దేరా...
ఇంటినుంచి బస్టాప్ 5 నిముషాలే అయినా...!

ఈసారి బస్సు 10:00 కే వచ్చేసింది... ;)

"నువ్వేక్కబోయే రైలు జీవితకాలం లేటు" లో రైలు బదులు బస్సు అని రాసుంటే బావుండు అనుకున్నా...