Friday, May 22, 2009

సింహాద్రి శేఖర విభో తవ సుప్రభాతం!


          ఎవరికి సుప్రభాతం పాడినా కౌసల్యా  సుప్రజా రామ! పూర్వా సంధ్యా ప్రవర్తతే! తోనే మొదలు పెట్టాలి అది రాముడికే కాదు ఏడుకొండల మీదున్న  వెంకన్నకైనా సరే.


అందరికీ రొజూ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంతోనే రోజు మొదలవుతుంది.ప్రతి ఇంటి రేడియోలో ఎమ్.ఎస్.సుబ్బులక్ష్మిగారి సుప్రభాతం వెంటనే విష్ణుసహస్రనామం మనం వింటూనే ఉంటాం.కానీ నా చిన్నతనంలో నాకు రోజు మొదలయ్యేది  మాత్రం మా సిమ్మాద్రి అప్పన్న సుప్రభాతంతోనే.


సుప్రభాతంలో...
సింహాద్రి శేఖర విభో! తవ సుప్రభాతం... తవ సుప్రభాతం... అంటుంటే చెవుల్లో అమృతం పోస్తున్నట్టుంటుంది.


ఘంటసాల పాటలన్నీ ఒక ఎత్తైతే భగవద్గీత ఒక్కటీ ఒక ఎత్తు... అట్లా గాయని పి.సుశీల ఎన్ని పాటలు పాడినా ఆమె జీవితం చరితార్థం అయింది మా అప్పని సుప్రభాతం పాడటం వల్లనే అంటే అతిశయోక్తి కాదేమో!


చలువ చందనాల సింగపుదొర మా  శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి కొలువుతీరిన సింహాచలం నాది. అన్ని రకాల సంపెంగల, పనస-అనాస వాసనలు గుబాళించే ప్రదేశం సింహాచలం.నేను పుట్టింది పెరిగింది అంతా అక్కడే.
అప్పని  ఆలయం కొండమీద మా నిలయం కొండ దిగువన. సింహాచలం మధ్యవీది అంటే చాలు లోకవిదితమే. శ్రీవైష్ణవవీధి అని మరో పేరు ఆ వీధికి.వీధి వీధంతా శ్రీవైష్ణవ కుటుంబాలే.స్వామి  కిందకి వెంచేసినప్పుడు వీధిలో చేసే కోలాహలం ఇంతా అంతా కాదు.... అది ఎంత కనులపండుగగా ఉంటుందో చూసి తీరాలితప్ప చెప్పనలవి కాదు సుమండీ!


సింహాచలం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ప్రహ్లాదుడు వేడగా కరుణించిన శ్రీహరి హిరణ్యకశిపుణ్ణి సంహరించి, ఆ కోపం చల్లారక స్వామి ఉగ్రరూపుడై విహరిస్తుంటే దేవతలంతా స్వామిని శాంతింపచేయమని ప్రహ్లాదుడుని కోరతారు. వారు స్వామిని అలా కీర్తిస్తూ ఆయన వెంటనే తిరుగుతూ ఉండగా స్వామి నాలుగు ప్రదేశాలలో ఆగినాడట.వాటిలో సింహాచలం ఒకటి.(మిగిలినవి కదిరి అహోబిలం ఇంకొక ప్రదేశం ప్రస్తుతపటంలో దాని జాడ తెలియదు).


మా ఇంటివారం స్వామిని కొన్ని దశాబ్దాలుగా కోలుస్తున్నాము. మా తాతగారి నాయనగారు ప్రధాన అర్చకులుగా చేసినారట.గత 25 వసంతాలుగా మా  చిన్నాయన  స్వామి సేవకి సన్నిధికి  వెళ్ళటం నేనెరుగుదును.
తెలవారుతూ ఉండగానే మా ఇంట్లో సందడి మొదలయ్యేది.. ఎవరు లేచినా లేవకపోయినా చిన్నాన్నతో పాటు నేను కూడా లేచేవాడిని...
ఉదయం ఆరాధనా చేసుకుని చిన్నన్న కొండకి వెళ్ళేవారు.మేము మెట్ల మించి వెళ్ళేవాళ్ళం.
ఆలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది... కొత్తవాళ్ళకి కుడా ఇంతకముందు వచ్చిన అనుభూతే కలుగుతుంది.
ఎంతో ఆహ్లాదమైన వాతావరణం.
లోపల స్వామి చందనంతో కప్పబడి ఉంటాడు.అదే నిత్య రూపం.
కేవలం వైశాకసుద్ధ తదియ నాడు మాత్రమే నిజ రూపంలో స్వామి దర్శనమిస్తాడు.
స్వామితోపాటు ప్రహ్లాదుడిని కూడా చూడవచ్చు.



contd...

No comments: