Saturday, December 25, 2010

అనగనగా... ఒక కథ?

కథలు ఎప్పుడూ అనగనగా తోనే ఎందుకు మొదలవుతాయి? 

                 మనం చిన్నప్పటినుండి కథలు వింటూనే ఉన్నాం.అమ్మ చెప్పినా అమ్మమ్మ చెప్పినా అందరు కూడా అనగనగా ఒక రాజు.... అనో, అనగా అనగా ఒక ఊరిలో... అనో మొదలు పెడతారు.
ఏ కథైతేనేం అనగనగాతోనే మొదలవ్వాలి.అనగనగా లేకుండా మాత్రం కథ మొదలవ్వదు.చాలామటుకు పుస్తకాలలో, పేపర్లలో ప్రచురింపబడిన కథలన్నీ కూడా అలాగే మొదలవుతాయి.

పిల్లలకి జ్ఞానం పెంపొందించడంకోసం చిన్నప్పటినుంచే కథలు చెప్పేవారు.విష్ణుశర్మ మనకి అందించిన పంచతంత్ర కథల వల్ల రాజకుమారులే కాదు మనం కూడా ఎంతో లబ్ధి పొందాం కదా! అలాగే కాశీ-మజిలీ కథలని తెనాలి రామకృష్ణుడి కథలని,విక్రం-భేతాళ్ కథలని చాలా ప్రసిద్ధమైన కథలు మనమెరుగుదుము.
సరదాగా నలుగురు కూర్చుని పిచ్చాపాటి అప్పుడు కూడా ఎవరైనా వక్త ఉంటే వాడు తప్పకుండా ఏదో కథ మొదలు పెట్టకమానాడు.కథలు మనకి కొత్త కాదు కదా!

ఈ కథలేవైతే ఉన్నాయో చాలా మటుకు కల్పితాలు...ఎక్కడో జరిగిన విషయాన్ని అంటే మనం నేరుగా చూడని విషయాన్ని పరోక్షంగా తెలుసుకున్నప్పుడు ఈ కల్పితాలకి ఎక్కువ తావు ఉంటుంది.చాలావరకు జరిగినది కొంత జరగనిది, ఊహించి కల్పించి కథగా మలచి చెప్తారు.

ఇలా కథలు కల్పించి చెప్పడానికి ఊహాశక్తి కావాలి.ఆ ఊహించినదానిని చెప్పడంలో నేర్పు కావలి.
ఒకసారి మా తమ్ముడు బండి పడేసి మా ఇంట్లో తాతగారికో కథ,నాన్నగారికో కథ, చిన్నాన్నకో కథ మొత్తం ౩ కథలు చెప్పాడు.
ఊహకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కొన్నిసార్లు నిజమైన కథకంటే ఇలా ఊహించి చెప్పిన కథకే ఎక్కువ విలువుంటుంది.
కథని కేవలం కథగానే కాకుండా కథలోని అంతరార్థం తెలుసుకున్నప్పుడే కథకి అసలైన విలువ లభించినట్టు.కథయొక్క నీతి తెలుసుకున్నంత మాత్రాన చాలదు  ప్రతి కథలో ఏదో ఒక అంశం(కాన్సెప్ట్) ఉంటుంది దాన్ని కూడా తెలుసుకున్నప్పుడే కథలు కలకాలం చిరకాలం ఉంటాయి.  

సరే! ఇంతకీ ఈ అనగనగా కథ ఏంటి? చూద్దాం...
ఇలాగే ఒకడు కథ చెప్పి ఇంకొంతమంది విని ఆ కథని ఇంకొంతమంది అని మరి కొంతమంది విని అలా అని అని విని విని అలా వాళ్ళు అనగా అనగా మనం వినగా వినగా అది కాస్తా అనగనగా గా మారింది...
అప్పటినుంచి ఏ కథ చెప్పినా పూర్వం నుంచి వస్తున్న కథలన్నిటికి ముందు అనగనగా చేర్చి చెప్పడం రివాజు అయింది.

Tuesday, July 27, 2010

7 చేపల కథ


                      పసిపిల్లలకి బువ్వ పెట్టడం ఒక పెద్ద పని.ఊసులాడాలి, బుజ్జగించాలి, కథలు చెప్పాలి, కబుర్లు చెప్పాలి అప్పటికి కాని బువ్వ తినరు.ప్రతి ఇంటిలోనూ జరిగే తంతే ఇది.
                     అలనాటి రామచంద్రుడు కూడా అద్దంలో చందమామని చూపిస్తే కాని పాలు తాగాలేదంట! కన్నయ్యకి పాలు పట్టడానికి, బువ్వపెట్టడానికి ఎన్ని కష్టాలు పడిందో మన యశోదమ్మ ఇల్లంతా పరుగులెత్తించేసే  
వాడంట.అట్లాంటి కృష్ణయ్యకి రామకథ చెప్పి బువ్వ పెట్టిందని మనకి తెలుసు.
అలాగే నా చిన్నప్పుడు నాకు బువ్వ పెట్టడానికి మా నానమ్మ చెప్పిన కథ ఇదిగో... 
                   అనగనగా ఒక రాజు.. రాజుగారికి ఏడుగురు కొడుకులు.. ఏడుగురు కొడుకులు వేటకెళ్ళారు.. వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు. ఒక చేప ఎండలేదు... చేప చేప ఎందుకెండలేదు? గడ్డివాము అడ్డొచ్చింది.... గడ్డివాము గడ్డివాము ఎందుకు అడ్డోచ్చావ్...? ఆవు నన్ను మేయలేదు... ఆవూ ఆవూ ఎందుకు మేయలేదు?? గొల్లవాడు నన్ను వదలలేదు... గొల్లవడా గొల్లవడా ఆవుని ఎందుకు వదలలేదు?? అవ్వ నాకు బువ్వ పెట్టలేదు అవ్వా అవ్వా బువ్వ ఎందుకు పెట్టలేదు? పిల్లవాడు ఏడుస్తున్నాడు... పిల్లాడా పిల్లాడా ఎందుకేడుస్తున్నావు? చీమ నన్ను కుట్టింది... చీమా చీమా ఎందుకు కుట్టావు? చీమ అంది... నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అని...
ఇంకేంటి? కథ కంచికి మనం ఇంటికి...
కథ అయిపొయింది... అంతే అని అందరం అనుకుంటాం...
కానీ చాల ఉందండీ!

నాకు ఏం తోచకపోతే  మా చిన్నాన్నకి  ఫోన్ చేశా...
చిన్నాన్నా ఏం తోచట్లే నాకు ఏదైనా చెప్పు అన్నాను.
ఏం చెప్పను? అన్నాడు...

నాకు కొంచం కథల పిచ్చి ఎక్కువ... అందుకని ఒక కథ చెప్పు అన్నా...  
మా చిన్నాన్నని కథ చెప్పమంటే ఇదే కథ మొదలు పెట్టాడు నేనూ మధ్య అందుకున్నా... కథ అయింది...
అరె! చిన్నాన్నా నాకు ఈ  కథ చిన్నప్పుడే తెలుసు... అన్నాను.
సరే! ఐతే నీకు ఈ కథలో ఏమర్థమయ్యింది  అన్నాడు.
ఇందులో అర్థమవకపోవడానికి ఏముంది? చీమ పుట్టలో వేలు పెడితే కుడుతుంది అన్నాను..
ఫక్కున నవ్వాడు చిన్నాన్న...
ఎందుకు చిన్నాన్నా నవ్వుతున్నావు అన్నాను.
అరేయ్! చిన్నవాడా... ఈ కథ చాల చమత్కరమైందిరా... అని మొదలుపెట్టాడు.
నేనూ ఉ.. కొట్టడం మొదలు పెట్టాను...
అనగనగా ఓ రాజు... రాజుగారి ఏడుగురు కొడుకులు వేటకెళ్ళి చేపలు తేవడం,అందులో ఒక చేప ఎండకపోవడం
వరకు సరే... అంతా బానే ఉంది. చేప ఎండలేదంట రాజుగారి కొడుకు చేపని అడిగాడంట చేపా చేపా ఎందుకు
ఎండలేదు? అని...
చేప ఎక్కడైనా మాట్లాడుతుందా?? అని ప్రశ్న వేసాడు.
నేను లేదు అన్నాను...
మనం కథల్లోనే ఇలా జంతువులూ పక్షులు చెట్లు మాట్లాడటం చూస్తుంటాం...
ఇది కథ కనుక సరే మాట్లాడింది అనుకుందాం...
చేప జవాబిచ్చిందట... గడ్డివాము అడ్డువచ్చిందని... సరే ఏదైనా అడ్డు పడితే ఎండదు అది నిజమే!
ఇలా చెప్పి ఎండని చేప తప్పించుకుంది...
కానీ ఇక్కడ రాజుగారి కొడుకు అక్కడితో ఆగలేదు... గడ్డివాముని కూడా అడిగాడు గడ్డివాము గడ్డివాము
ఎందుకు అడ్డోచ్చావ్ అని...
గడ్డివాము ఒక సాకు చెప్పింది ఆవు నన్ను మేయలేదు అని...
గడ్డివాము కూడా తప్పించుకుంది... నాది కాదు తప్పు ఆవు నన్ను మేయలేదు కనుక నేను అడ్డోచాను అంది...
సరే అని ఆవు ఆవునుండి గొల్లవాడు గొల్లవాడినుంచి అవ్వ అవ్వ నుంచి పిల్లవాడు పిల్లవాడినుంచి చీమ. అక్కడితో
కథ అయిపోతుంది...
ఇక్కడ ఏం జరుగుతోందంటే!
ఏదైనా ఒక పని సరిగా జరగకపోతే తన తప్పు ఉన్నా తప్పు నాది  అని ఒప్పుకోడు...
పక్కవాడి మీదకి నేట్టేస్తున్నాడు... వాడు ఇంకొకడి మీదికి  వాడు  మరొకడి మీదికి...
నేరం నాది కాదు వాడిది ఆ పక్కవాడిది అని అలా అలా ఎక్కడికో పోతోంది.
సరైన కారణం లేకుండా సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. 
ఇలా ఉంటుందిరా లోకంలో అని ఎంతో అందంగా ఈ కథ చెప్పాడు మనకి.
 
అందుకే ఓ సినిమా కవి రాసాడు "ఇంతేనయా!  తెలుసుకోవయా !! ఈ లోకం ఇంతేనయా..." అన్నాడు చిన్నాన్న.
ఈ లాజిక్ చిన్నప్పుడే చెప్తే నీకు అర్థం కాదు కదా? అందుకే ఇది కేవలం కథగానే చెప్తారు అప్పుడు.  
ఈ కథ ద్వారా లోకం పోకడ ఏమిటో కథకుడు మనకి ఇలా చెప్పాడు.అన్నాడు.
నేను ఆశ్చర్యపోయా!! అవును చిన్నన్నోయ్ నేనెప్పుడు ఇలా ఆలోచించలేదు సుమీ!
బావుంది చిన్నాన్నా చాల బావుంది!
జోహార్లు చిన్నాన్నా నీకు..!
చాలా కొత్తగా ఉంది... ఎప్పుడూ కథని అలా కథగానే చూసేవాణ్ణి. ఇప్పుడు ఈ కథలో ఇంత అంతరార్థం ఉందంటే
అమ్మో! కథలు కూడా కొత్త కోణాల్లో చూడలన్నమాట...
పెద్దలు మనకి ఏది చెప్పినా దానికి ఓ అర్థం పరమార్థం ఉంటుంది...
అందుకే కదా! మనమంటాం.. "పెద్దల మాట... చద్దన్నం మూట".

Friday, February 5, 2010

సంఘం-సంబంధం

మనం ఎక్కడైనా ఎక్కువ కాలం గడిపితే దానితో అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధం సంఘానికి దారితీస్తుంది.సంఘంలో ఉండాలంటే కొన్ని పాటించాలి.మనిషి సంఘ జీవి కనుక పాటిస్తాడు.

సమాజంలో మనిషి కుటుంబంతో నివిసిస్తుంటాడు,ఒక్కడుగా జీవనం సాగించడానికి మొగ్గుచూపడు. తలిదండ్రులు, ఉంటే వారి తలిదండ్రులు, అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు పిల్లలు, ఇలా ఒక పెద్ద కుటుంబంతో జీవిస్తుంటాడు.ఒక కుటుంబంలో ఒకరే  పెద్దగా ఉన్నంతకాలం ఆ కుటుంబం చిరకాలం పదిలంగానే ఉంటుంది.
ఎక్కడైనా ఎప్పుడైనా పోరపోచ్చులు ఉన్నా కూడా ఇంటి పెద్ద దానిని సమస్య కనివ్వడు.అలా చేయడం ఇంటి పెద్ద బాధ్యత కూడా.
ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ చిన్నచిన్న విభేదాలు రావడం  సహజం. వాటిని పెద్దవి కానివ్వకుండా చేయడం కూడా సౌధసరధి పని.

పూర్వం, పెద్దలు ఏం చెప్పినా, అది  తు.చ. తప్పకుండా పాటించేవారు.
ఎవరైనా సరే...
అప్పటి రాముడి నుంచి...
రామా! అడవికి వెళ్లి 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యి అని దశరధుడు చెప్పినవెంటనే రాముడు సరేనన్నాడు వేరేం మాట్లాడలేదు.
అదేంటి నానగారు 14 సంవత్సరాలా? దేనికండి? అని ప్రశ్నవేయలేదు.మరో మాట లేకుండా బయలుదేరాడు.
మితోపాటే నేను అని సీతమ్మవారు నేను కూడా అని లక్ష్మణుడు బయలుదేరారు.
అరె! నిన్ను కదయ్యా వెళ్లమంది నన్ను కాదు నేనెందుకు రావాలి? ఆనలే సీతమ్మ. నేనిక్కడే ఉంటా నువ్వెళ్ళి వచ్చే య్ ఆనలే లక్ష్మణుడు.
మొత్తం అయోధ్యలో ఉన్న ప్రజలందరూ రామునితో బయలుదేరారట అడవికి... శ్రీరామాయణం చెప్తోంది.
రాముడు సీతకి భర్తకనుక,వారిద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం ఉన్నది కనుక సీతమ్మ రాముని వెంట వెళ్లిందంటే అర్థముంది మరి లక్ష్మణస్వామి ఎందుకు వెళ్లినట్టు?
అదే భ్రాత్రుసంబంధం.
భరతుడు చిత్రకుటమునకి వచ్చి ప్రాయోపవేశం చేస్తానంటాడు. అట్లాంటి సమాజం నుండి వచ్చిన వాళ్ళం మనం.

బంధం-సంబంధం:
సాధారణంగా ఒక తలిదండ్రులకి పుడితే రక్తసంబంధం ఏర్పడుతుంది.పెళ్లి అనే ఒక ప్రక్రియ ద్వారా ఒక ఇంటి అమ్మాయిని తెచ్చి సంబంధం ఏర్పరుచుకుంటున్నాం.ఈ సంబంధం ఒక బంధంగా మార్చడానికి తాళి కట్టి భార్యకి భర్త అవుతున్నాడు. భార్యభర్తల బంధం విడదీయరానిదై ఉండటానికి సమాజం పెళ్లి అన్నది పెట్టింది. మిగిలిన ఎన్ని బంధాలు ఎలా పోయిన భార్య భర్త జీవించినంత కాలం తనతోనే సహజీవనం చేయాలి.ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం.
contd...