నాకేం తోచకపోతే దగ్గరలో ఉన్న కోవేలకి వెళ్లి కొంచంసేపు కూర్చుని వీలైతే ఒక కీర్తన ఆలపించి వచ్చేస్తుంటా...
ఇలా సాగుతోంది ప్రవచనం....
"సర్వం విష్ణుమయం జగత్" అని, హరి ఇందు కలడు అందు లేడు అని సందేహం వలదు, లోకమంతా హరిమయమై ఉంటుంది ,నీలో నాలో కూడా ఉన్నాడు హరి,చక్రి సర్వోపగతుండు అని ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితో అంటాడు.
అలాగే ఒక రోజు కోవెలకి బయలుదేరా...
సాయంత్రం 7 కావస్తోంది... చీకటి కమ్ముకుంది... కోవెల వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది... ఆలయ గోపురం విద్యుద్దీపాల వెలుగులో చాలా అందంగా కానవచ్చింది...
వెళ్లేసరికి ఎవరో ఒకాయన కంచు కంఠంతో ప్రవచిస్తున్నారు...
ఇలా సాగుతోంది ప్రవచనం....
అంతలా విశ్వశించాడు కనుకనే హిరణ్యకశిపుని శిక్షలకి కించిత్ కూడా చలించలేదు ప్రహ్లాదుడు.స్వామి, నమ్మిన వాడిని ఎట్లా చూసుకుంటాడో మనకి తెలుసు కదా! గజేంద్రుణ్ణి ఎట్లా రక్షించాడు? పరుగున వచ్చినాడు కదా పంచ ఉడిపొతున్నా సరే!
విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి నామం విశ్వం. దీనిని "ఓం విశ్వాయ నమః" అని ఉపాసిస్తాం. ఈ జగత్తంతా వ్యాప్తి చెందినవాడైనందువల్ల అలా పిల్చుకుంటాం.
"అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణస్థితః" అని కదా మనం రోజు కీర్తించేది.... అని ప్రసంగిస్తున్నారు...
నేను ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుని వచ్చి కూర్చున్నా..
ప్రవచనం పూర్తి అయ్యింది...
ప్రవచనకర్త బయటికి బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు...
ఒకాయన ప్రవచనకర్తని ఆపి అడిగారు...
అన్నిటా ఉన్నవాడా? మొత్తమంతా వ్యాప్తి చెందాడా? మరి నీలో నాలో కుడా ఉన్నప్పుడు నీకు నాకు తేడా ఏంటి?
నేనెంతో నువ్వు అంతే నువ్వెంతో నేను అంతే కదా... అలాంటప్పుడు అన్నీఒకటే కదా! అని...
నేనలా చూస్తూ ఉన్నా... ఏంటి ఈయన? నువ్వు, నేను ఒకటి అంటాడు...? అన్నీ వేరు వేరుగా ఉన్నాయి కదా?
కొంపతీసి ప్రసాదం కూడా నీది నాది అని లేదు అంటాడో ఏమో? అనుకున్నా...
అవును అన్నీ ఒకటే!
అందుకే సర్వం జగన్నాథం అని అంటుంటాం!
మీకు తెలిసే ఉంటుంది... ఒడ్డెదేశంలో పూరి అని ఓ పుణ్యక్షేత్రం ఉంది... అక్కడ జగన్నాథుడు కొలువై ఉన్నాడు.అక్కడి ప్రసాదం చాలా ప్రసిద్ధి.40 రకాల ప్రసాదాలు చేస్తారు. ప్రసాదాలన్నీకావిళ్ళతో తెచ్చి పెడతారు.
వేడి వేడిగా ప్రసాదం... చాలా బావుంటుంది... జగన్నాధుడికి ప్రసాదాలు ఆరగింపుకి తీసికెళ్ళేటప్పుడు ఎవరూ చూడరాదు.
ఏకః స్వాదు న భుంజీథ అని మన పెద్దలు చెప్తారు....అంటే మధురపదార్ధం ఒక్కడు భుజించకూడదు.ప్రక్కవారికి కూడా పెట్టి అప్పుడు తను తీసుకోవాలి అని.
ఆ దేశం రాజైనా సరే జగన్నాధుడి ప్రసాదం ఎవరు ఇచ్చినా కళ్ళకి అద్దుకుని తీసుకుంటాడు. ఎవరైనా తెలియక వదిలేసినా సరే అక్కడి వారు ప్రసాదం పుచ్చుకుంటారు.
తన,పర భేదం ఉండదు అక్కడ.ఏం చేసినా జగన్నాధునికే అర్పణం...
ఇలా ముగిసింది వాళ్ళిద్దరి సంభాషణ...
నేనింటికి బయల్దేరా... అదే ఆలోచన.... సర్వం జగన్నాథం అని...
అప్పుడనిపించింది....
అందుకే మన ఇళ్ళలో మడి తడి ఆచారం వ్యవహారం అని ఉన్నా కొన్నిసార్లు అవి ఇవి ముట్టేసుకుంటే సర్వం జగన్నాథం అనేస్తుంటారు అని.
No comments:
Post a Comment